Russia Ukraine War | డ్రోన్లు, మిస్సైళ్లతో భారీ అటాక్

Russia Ukraine War | డ్రోన్లు, మిస్సైళ్లతో భారీ అటాక్

Russia Ukraine War | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ విరుచుకుపడింది. తాజా దాడుల్లో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని కీవ్‌తో పాటు ఖార్కీవ్, ఇతర కీలక నగరాలు లక్ష్యంగా భారీ స్థాయిలో డ్రోన్లు, క్షిపణి దాడులు జరిగాయి.

కీవ్‌లో 11వ శతాబ్దానికి చెందిన డార్మిషియన్ కేథడ్రల్‌పై దాడి జరగడంతో చర్చిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కీవ్‌లో నలుగురు మృతి చెందగా, ఖార్కీవ్‌లో మంటలను ఆర్పేందుకు వెళ్లిన ఐదుగురు రెస్క్యూ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ ప్రధాని యులియా సిరిడెంకో ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఇది దేశ ప్రజలు, వారసత్వంపై క్రూరమైన దాడిగా అభివర్ణించారు.

మరోవైపు, ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో రష్యాలోని మాస్కో సమీపంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. రష్యా డ్రోన్, మిస్సైల్ దాడుల వల్ల అనేక భవనాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. సుమారు 14 వేల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం.

Russia Ukraine War

రష్యా రక్షణ శాఖ ప్రకారం, ఉక్రెయిన్‌లోని మూడు ప్రధాన నగరాల్లో మిలిటరీ పరిశ్రమ కేంద్రాలు, ఎయిర్‌ఫీల్డ్‌లపై లాంగ్ రేంజ్ దాడులు నిర్వహించామని వెల్లడించింది. ఆకాశం, భూమి, సముద్ర మార్గాల నుంచి డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించామని తెలిపింది.

ఉక్రెయిన్ మాత్రం రష్యా ప్రయోగించిన 70 క్షిపణులు, 600కు పైగా డ్రోన్లను అడ్డుకున్నామని పేర్కొంది. చర్చిపై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలను రష్యా ఖండిస్తూ, పేట్రియాట్ మిస్సైల్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పేర్కొంది.

Leave a Reply