రైతులకు సాగునీరు ఇవ్వండి..

రైతులకు సాగునీరు ఇవ్వండి..

  • రాయిన్‌పల్లి ప్రాజెక్టుకు మరమ్మతులు చేయండి
  • మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్ రెడ్డి
  • రాయిన్‌పల్లి హై లెవల్ కాల్వ ధోని పునరుద్ధరణకు డిమాండ్
  • కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ ధర్నా

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: రాయిన్‌పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వ, లో లెవల్ ధోనికి తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

సోమవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాల కారణంగా మెదక్ మండలంలోని రాయిన్‌పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వ, లో లెవల్ ధోని దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,500 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

ధోని దెబ్బతిని ఏడాది గడిచినా ప్రభుత్వం ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

రాయిన్‌పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వ ద్వారా తిమ్మానగర్, మక్తా భూపతిపూర్, గుట్టకిందిపల్లి, శివాయిపల్లి, మల్కాపూర్ తండా, వెంకటాపూర్, కొంటూర్ గ్రామాల రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయానికి ఆధారపడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ఈ కాల్వ ద్వారా మెదక్ పట్టణ పరిధిలోని గోసముద్రం, పిట్లంబేస్, బంగ్లా చెరువులు కూడా నిండుతాయని వివరించారు.

రాయిన్‌పల్లి ప్రాజెక్టు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం. లావణ్య రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి, కృష్ణారెడ్డి, మెదక్ మండల పార్టీ అధ్యక్షుడు అంజగౌడ్, మాజీ ఎంపీపీ కిష్టయ్య, మాజీ వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు మాయ మల్లేశం, ఆర్.కే. శ్రీనివాస్, బీమరి కిషోర్, బీఆర్ఎస్ నాయకులు మరియు వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.