పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
- పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- 28న ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్కలు వేయించాలి
- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు కార్యక్రమం
- 29, 30 తేదీల్లో ఇంటింటి సర్వే ద్వారా పోలియో చుక్కలు
- జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. జూన్ 28 నుంచి 30 వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో మొత్తం 1,80,405 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు ఈనెల 28న 1137 పోలియో బూత్‌ల ద్వారా పోలియో చుక్కలు వేస్తారని వివరించారు. 28న వేసుకోని పిల్లలకు జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తారని చెప్పారు. తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలను సమీప పోలియో బూత్‌కు తీసుకువెళ్లి చుక్కలు వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమం విజయవంతానికి అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థలు, మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జూన్ 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించే పల్స్ పోలియో బూత్‌లకు తమ ఐదేళ్లలోపు పిల్లలను తప్పనిసరిగా తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆరోగ్యవంతమైన భావితరాల నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
