Telangana Heavy Rains | ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌లతో రాష్ట్రం మొత్తం అప్రమత్తం

Telangana Heavy Rains | ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌లతో రాష్ట్రం మొత్తం అప్రమత్తం

Telangana Heavy Rains | మూసీ నదిలో భారీ వరద ప్రవాహం
జలాశయాలకు పెరిగిన ఇన్‌ఫ్లో
హైదరాబాద్‌లో వచ్చే మూడు రోజులు వర్షాలు హెచ్చరిక

Telangana Heavy Rains | హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో ఈ నెల 18 నుంచి 20 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ తెలంగాణ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దానికి తోడు నైరుతి రుతుపవనాలు బలంగా కదలడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొట్టే పరిస్థితి ఉందని పేర్కొంది.

సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో అవసరం లేకుండా బయటకు రావద్దని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

రాజధాని హైదరాబాద్‌తో పాటు మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, మెదక్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, సిద్దిపేట, జనగామ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు–మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

రాష్ట్రంలో ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని, నాలుగైదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వచ్చే మూడు రోజులపాటు సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం ఉదయం కురిసిన వర్షంతో ఆర్‌యూబీ అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఎగువ పరివాహక ప్రాంతాలు శంకరపల్లి, వికారాబాద్, నవాబ్‌పేట్ పరిసరాల్లో కురిసిన భారీ వర్షాలతో మూసీ నది ప్రవాహం పెరిగింది. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షంతో అర్ధరాత్రి దాటాక మూసీ వరద ప్రవాహం ప్రారంభమైంది.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. జలాశయాల నీటిమట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. అవసరమైతే నీటి విడుదలపై అధికారిక ప్రకటనలు జారీ చేస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply