మార్కెట్ కమిటీలో కంప్యూటర్ ఆపరేటరే ‘ఆల్ ఇన్ వన్’!
మార్కెట్ కమిటీలో కంప్యూటర్ ఆపరేటరే ‘ఆల్ ఇన్ వన్’!
- కార్యదర్శి గైర్హాజరుతో కార్యాలయ బాధ్యతలన్నీ మధు భుజాలపై
జైనూర్, ఆంధ్రప్రభ : సాధారణంగా ఒక ఉద్యోగికి ఒక నిర్దిష్ట బాధ్యత మాత్రమే ఉంటుంది. అయితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మాత్రం కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మధు అనేక బాధ్యతలను నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.
మార్కెట్ కమిటీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మధు, కార్యాలయ నిర్వహణకు సంబంధించిన పలు పనులను సమర్థంగా నిర్వహిస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ రావు కార్యాలయానికి వచ్చిన సందర్భాల్లో కూడా వివిధ పరిపాలనా పనులను మధుతోనే నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మార్కెట్ కమిటీకి రెగ్యులర్ కార్యదర్శిగా ఇర్ఫాన్ హైమద్ ఉన్నప్పటికీ, ఆయనకు ఇతర మార్కెట్ కమిటీల ఇన్చార్జి బాధ్యతలు కూడా అప్పగించడంతో జైనూర్ కార్యాలయానికి తరచుగా హాజరు కాలేకపోతున్నారు. దీంతో కార్యాలయ నిర్వహణ, రైతులు, వ్యాపారులకు అవసరమైన సేవలు, పరిపాలనా వ్యవహారాలు ఎక్కువగా కంప్యూటర్ ఆపరేటర్ మధు పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి.
మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొంటూ రైతులకు, వ్యాపారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను విని సంబంధిత సమాచారం అందిస్తూ వారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు.
కొన్ని సందర్భాల్లో అటెండర్లు అందుబాటులో లేకపోయినప్పుడు కార్యాలయాన్ని తెరవడం, మూసివేయడం వంటి బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా అదే కార్యాలయంలో పనిచేస్తూ స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహనతో సేవలు అందిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కార్యాలయంలో ఎదురయ్యే పలు సమస్యలకు పరిష్కార మార్గాలు సూచిస్తూ, రైతులు, వ్యాపారులకు అవసరమైన సలహాలు అందిస్తూ మధు సేవలందించడం విశేషమని స్థానికులు పేర్కొంటున్నారు. ఒక కంప్యూటర్ ఆపరేటర్‌గా ప్రారంభమైన బాధ్యతలు ప్రస్తుతం కార్యాలయ నిర్వహణలో కీలక పాత్రగా మారడం జైనూర్ మార్కెట్ కమిటీలో చర్చనీయాంశంగా మారింది.
