శభాష్ పోలీస్..!
- మూర్చ వచ్చిన వ్యక్తికి ప్రాణం పోసిన ఎస్సై
- నిజాయితీ చాటుకున్న బ్లూ కోల్ట్ పోలీసులు
- ఎస్సైని, పోలీసులను అభినందించిన జనం
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మూర్చ వచ్చి పడి ఉన్న వ్యక్తిని సమయస్ఫూర్తిగా ఎస్ఐ, బ్లూ కోల్ట్ హెడ్ కానిస్టేబుల్, హోంగార్డు వ్యవహరించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ప్రాణం పోశారు. అతని వద్ద రూ. 1,08, 000లను అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. దీంతో ఎస్సైని, ఆ పోలీసులను జనం శభాష్.! అని మెచ్చుకుంటున్నారు.
ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రోడ్డు పక్కన లోతోర్రె గ్రామానికి చెందిన కుర్సెంగ దేవరావు ఆదివారం రాత్రి పడి ఉండి నురగవస్తుండగా, అక్కడికి చేరుకున్న బ్లూ కోల్ట్ డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ దేవన్న, హోంగార్డు నీలయ్య ఆ వ్యక్తిని గమనించి వెంటనే స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ కు తెలియజేశారు. దీంతో సమయస్ఫూర్తిగా స్పందించిన ఎస్సై వెంటనే ఓ ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపి చికిత్స అందించారు. అతని వద్ద కవర్లో ఉన్న రూ. 1,08, 000 లను భద్రపరచి అందజేసినందుకు ప్రశంసించారు.
ఆస్పత్రిలో కోలుకొని క్షేమంగా వచ్చిన దేవరావుకు మంగళవారం సాయంత్రం స్టేషన్ ఆవరణలో గ్రామ సర్పంచి బోడ శంకర్ సమక్షంలో ఎస్సై ఉదయ్ కిరణ్ ఆ నగదు డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… ప్రజలు డబ్బుల విషయంలో తగు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రయాణం చేసేటప్పుడు మహిళలు విలువైన బంగారు,వెండి ఆభరణాలను భద్రపరచుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
