రక్తదానం మరొకరికి ప్రాణదానం..

రక్తదానం మరొకరికి ప్రాణదానం..

  • యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలి
  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
  • ఐటీ మాస్టర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం

ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : రక్తదానం అత్యున్నతమైన మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసిన రక్తదానం మరొకరికి ప్రాణదానంగా మారుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ఐటీ మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ఒక్క యూనిట్ రక్తం… ఎన్నో కుటుంబాల్లో ఆశల వెలుగు నింపగలదు అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. ప్రమాద బాధితులు, శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులు, గర్భిణీలు తదితరులకు అత్యవసర సమయాల్లో రక్తం ఎంతో అవసరమవుతుందని చెప్పారు. ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం వల్ల దాత ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని, నిర్దిష్ట వ్యవధిలో రక్తదానం చేయడం ద్వారా సమాజానికి అమూల్యమైన సేవ చేసిన వారవుతారని పేర్కొన్నారు.

యువత సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి..
యువత సామాజిక బాధ్యతతో రక్తదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని మానవత్వాన్ని చాటాలని సూచించిన ఎమ్మెల్యే, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న రెడ్‌క్రాస్ సొసైటీ నిర్మాణం మరో ఆరు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు.

అనంతరం రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. శిబిరం నిర్వహించిన ఐటీ మాస్టర్ నిర్వాహకుడు వేముల శంకర్‌తో పాటు కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, టౌన్ అధ్యక్షులు దేవన్ , స్థానిక ప్రజాప్రతినిధులు, ఐటీ మాస్టర్ సభ్యులు, యువకులు, రక్తదాతలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply