ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి..
కడెం, ఆంధ్రప్రభ : గ్రామాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎలగడప గ్రామ సర్పంచ్ నర్సింగ్ అశ్విత రమేష్ కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కడెం మండలంలోని ఎలగడప గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని పలు వీధుల గుండా ర్యాలీ చేపట్టి, విద్యార్థుల తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, వారానికి మూడు కోడిగుడ్లు, మూడు రోజుల పాటు అంబలి అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా త్వరలో అల్పాహార పథకం కింద ఇడ్లీ లేదా వడ వంటి బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా అందించనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం అందించే విద్యార్థుల కిట్‌లో 21 రకాల వస్తువులు ఉంటాయని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూచనపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ రాపర్తి శ్రీనివాస్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, విద్యా కమిటీ చైర్మన్ రాధ, మాజీ విద్యా కమిటీ చైర్మన్ లక్ష్మి, వార్డు సభ్యులు, డ్వాక్రా మహిళలు, విద్యావంతులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
