మేకలతోనే జీవితం… మేకల మండి వద్దే అంతం

మేకలతోనే జీవితం… మేకల మండి వద్దే అంతం

  • వేషాలపల్లిలో వృద్ధ కాపరి దారుణ హత్య..
  • తలపై బలమైన దెబ్బలతో మృతి
  • రాత్రి మేకలకు కాపలా.. ఉదయం రక్తపు మడుగులో శవం
  • పాతకక్షలా..? ఆస్తి వివాదమా..? అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు

భూపాలపల్లి రూరల్/ భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జీవితాంతం మేకలనే నమ్ముకుని బతికిన ఓ వృద్ధ కాపరి చివరకు తాను కాపలా కాసిన మేకల మండి వద్దే హత్యకు గురికావడం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపింది. వేషాలపల్లి గ్రామానికి చెందిన కొడారి సమ్మయ్య (68) ఆదివారం ఉదయం రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించడంతో గ్రామం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.

కుటుంబ పోషణ కోసం ఏళ్లుగా మేకల పెంపకమే జీవనాధారంగా చేసుకున్న సమ్మయ్య, ప్రతిరోజులాగే శనివారం రాత్రి కూడా తన మేకల మండి వద్దే నిద్రించాడు. అయితే తెల్లవారుజామున అక్కడికి వెళ్లిన స్థానికులకు కనిపించిన దృశ్యం గుండెల్ని కలిచివేసింది. మేకల మధ్య ప్రశాంతంగా నిద్రించాల్సిన సమ్మయ్య రక్తపు మడుగులో పడి ఉండటం చూసి గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సమ్మయ్య తలపై బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. రోకలి బండ వంటి బరువైన వస్తువుతో తలపై దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో లభించిన ఆనవాళ్లను పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.

హత్య వెనుక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా..? ఆస్తి వివాదమా..? లేక మరేదైనా కారణమా..? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులను విచారిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. అనుమానితుల కదలికలపై కూడా ఆరా తీస్తున్నారు. సమ్మయ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కష్టపడి జీవనం సాగించిన వృద్ధుడు ఇలాంటి దారుణాంతానికి గురికావడం గ్రామస్థులను కలచివేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వేషాలపల్లిలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు వెనుక అసలు కారణాలు ఏమిటన్నది ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు త్వరలోనే నిందితులను గుర్తించి కేసును ఛేదిస్తామని చెబుతున్నారు.