తోట చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం.. టీడీపీ హర్షం

తోట చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం.. టీడీపీ హర్షం

టీడీపీ బీసీ నేత హత్య ఘటనకు న్యాయం దిశగా కీలక చర్య.. కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు

అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లాలో దారుణ హత్యకు గురైన టీడీపీ బీసీ నేత తోట చంద్రయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తూ ఆయన కుమారుడు వీరాంజనేయులుకు జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఈ నిర్ణయంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

ఆదివారం అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మాట్లాడుతూ, పట్టపగలు నడిరోడ్డుపై వైసీపీ రౌడీ మూకలు చంద్రయ్యను కిరాతకంగా హత్య చేశాయని ఆరోపించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని నాడు చంద్రబాబు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిలబెట్టుకుందని వారు పేర్కొన్నారు.

ఈ ఉద్యోగం కోసం ప్రత్యేక చట్ట సవరణ బిల్లు తీసుకురావడాన్ని గతంలో శాసనమండలిలో వైసీపీ నాయకులు అమానవీయంగా అడ్డుకున్నారని నేతలు మండిపడ్డారు. అయినప్పటికీ అసెంబ్లీలో బిల్లును ఆమోదించి నియామక పత్రం అందించడం ద్వారా కార్యకర్తలకు అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం అని మరోసారి నిరూపించిందని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, రాజశేఖర స్వామి దేవస్థానం చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు, పార్టీ నాయకులు మండలి రామమోహనరావు, దాసినేని శ్రీనివాసరావు, కంచర్ల ఆనంద్, కొండవీటి గోవిందు తదితరులు పాల్గొన్నారు.