INDvsAFG-ODI | గర్బాజ్ ఒంటరి పోరాటం.. భారత్‌కు 195 పరుగుల లక్ష్యం

INDvsAFG-ODI | గర్బాజ్ ఒంటరి పోరాటం.. భారత్‌కు 195 పరుగుల లక్ష్యం

ఆంధ్రప్రభ : వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన తొలి వన్డేలో ఆఫ్ఘానిస్థాన్ జట్టు భారత్‌కు 195 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది (INDvsAFG-ODI). ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ జట్టు 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్ మొత్తాన్ని ఒకే వ్యక్తి భుజాలపై మోస్తో.. జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఓపెనర్ రహ్మానుల్లా గర్బాజ్ భారత బౌలర్లపై విరుచుకుపడి కేవలం 51 బంతుల్లో 102 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ ఏకంగా 200గా నమోదైంది.

INDvsAFG-ODI

గర్బాజ్ తప్ప మిగతావారు విఫలం..

గర్బాజ్‌కు మినహా మిగిలిన ఆఫ్ఘాన్ బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ 27, అజ్మతుల్లా ఒమర్జాయ్ 26 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు భారత బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు. ఒక దశలో 15.3 ఓవర్లకు 142 పరుగుల వద్ద ఉన్న ఆఫ్ఘాన్.. చివరి 9 వికెట్లను కోల్పోయి 194 పరుగులకే పరిమితమైంది.

అరంగేట్ర ఆటగాళ్ల మెరుపు

భారత్ తరఫున అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. మరో డెబ్యూ ఆటగాడు హర్ష్ దూబే కూడా 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ తన 100వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసుకోగా, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు దక్కించుకున్నాడు.

భారత్‌కు 25 ఓవర్లలో 195 పరుగులు..

వర్షం ప్రభావంతో 25 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ 25 ఓవర్లలో 195 పరుగులు చేయాల్సి ఉంది. ధర్మశాల పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ.. ప్రారంభంలో వికెట్లు కోల్పోతే మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.