West, South HYD | హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన..
West, South HYD | హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన..
- బయటకు వెళ్లొద్దంటున్న అధికారులు
- తెలంగాణలో రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు నుంచి మూడు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్‌లో జల్లులు..
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో మోస్తరు నుంచి స్థిరమైన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, గోల్కొండ, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, షేక్‌పేట్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో వచ్చే రెండు గంటల పాటు వర్షం కొనసాగవచ్చని పేర్కొన్నారు. వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని.. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
శంషాబాద్ పరిసరాల్లో భారీ వర్ష సూచన
హైదరాబాద్ శివారు ప్రాంతాలైన శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, శంకర్‌పల్లి ప్రాంతాల్లో వచ్చే గంటపాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
80 కి.మీ వేగంతో గాలులు…
కాగా, ఇప్పటికే సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాల సమీపంలో ఉండవద్దని సూచించారు.
పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది.
ఎల్లో అలర్ట్ జిల్లాలు ఇవే – భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముండటంతో ఈ జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు.
