Wedding House Theft | రూ.5 లక్షల నగదు, బంగారం మాయం
Wedding House Theft | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో పెళ్లి ఇంట్లో చోరీ జరగడం కలకలం రేపింది. కుటుంబ సభ్యులు కూతురు పెళ్లి కార్యక్రమం కోసం ఫంక్షన్ హాల్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇంటికి తాళం వేసి అందరూ వివాహ వేడుకల్లో పాల్గొనగా, ఇదే అదనుగా భావించిన గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారంతో పాటు రూ.5 లక్షల నగదును అపహరించినట్లు సమాచారం.
పెళ్లి కార్యక్రమం ముగించుకుని ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు తాళాలు పగులగొట్టబడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఆ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చోరీకి పాల్పడిన వారి కోసం ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
