Cyber Fraud | విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58.94 లక్షల దోపిడీ
Cyber Fraud | విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58.94 లక్షల దోపిడీ
Cyber Fraud | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్లు మరోసారి తమ మోసపూరిత పన్నాగాలతో ఓ వ్యక్తిని లక్షల రూపాయలు కోల్పోయేలా చేశారు. మనీలాండరింగ్ కేసులో మీ పేరు ఉందంటూ భయపెట్టి, పటాన్‌చెరుకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి దాదాపు రూ.59 లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, పటాన్చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డికి ప్రవీణ్ కుమార్, రాజేశ్ మిశ్రా పేర్లతో ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేశారు. జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్‌కు సంబంధించిన భారీ మనీలాండరింగ్ కేసులో ఆయన ఆధార్ వివరాలు దుర్వినియోగమయ్యాయని, ఆయన పేరుతో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు.
అంతేకాకుండా, ఈ కేసులో మీపై విచారణ జరుగుతోందని, అరెస్టు చేసే అవకాశం ఉందంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కేసు నుంచి బయటపడాలంటే కొంత మొత్తాన్ని నిర్దిష్ట ఖాతాలకు బదిలీ చేయాలని సూచించారు. నేరగాళ్ల మాటలను నమ్మిన మోహన్ రెడ్డి, దశలవారీగా పలు బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.58.94 లక్షలు బదిలీ చేశారు. అనంతరం తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఉపయోగించిన ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, దర్యాప్తు సంస్థల పేర్లతో వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మి డబ్బులు బదిలీ చేయవద్దని, అనుమానం వచ్చిన వెంటనే సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
