చీపురు పట్టి ఊడ్చి….పైపుతో నీళ్లు చల్లి…
చీపురు పట్టి ఊడ్చి….పైపుతో నీళ్లు చల్లి…
- మోదీ 12 ఏళ్ల పాలన స్ఫూర్తితో
- క్లాస్ రూం ను అద్దంలా మార్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘‘స్వచ్ఛ పాఠశాల’’ కార్యకర్తగా మారారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ‘‘స్వచ్ఛ పాఠశాల’’ పేరుతో శుభ్రం చేసే పనికి శనివారం శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. పైపు నీళ్లతో తరగతి గదిని శుభ్రం చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ వర్గాలను కలుస్తున్నాం. అనేక సభలు, సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘‘స్వచ్ఛ పాఠశాల’’ పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని పాఠశాలలను పరిశుభ్రం చేయాలని నిర్ణయించామున్నారు . రాజకీయాలకు అతీతీంగా మన పాఠశాలను మనం శుభ్రం చేసుకుందామని కోరారు. స్పూర్తిదాయకమైన సేవా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారన్నారు. టీచర్లు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొని తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారన్నారు.
టెన్త్ ఫీజు నేనే చెల్లిస్తా..

ప్రభుత్వ పాఠశాలలను అభివ్రుద్ధి చేయాలన్నది నా సంకల్పమని, అందులో భాగంగానే ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఈసారి కూడా సైకిళ్లు అందించబోతున్నాం. టెన్త్ విద్యార్థులందరికీ నా వేతనం నుండి పరీక్ష ఫీజు చెల్లిస్తా. పాఠశాల అభ్యున్నతి కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతా. పాఠశాలలో నెలకొన్న సమస్యలపైనా త్వరలోనే సమీక్ష చేస్తా. పరిష్కారానికి చర్యలు తీసుకుంటా.

