Raptadu సూపర్‌ సిక్స్‌ ‘సూపర్‌ తుస్‌’ అయింది

Raptadu సూపర్‌ సిక్స్‌ ‘సూపర్‌ తుస్‌’ అయింది

  • రాప్తాడులో టీడీపీపై వైఎస్సార్‌సీపీ తీవ్ర విమర్శలు

రాప్తాడు(Raptadu), ఆంధ్రప్రభ:

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం రాప్తాడు నియోజకవర్గంలో ఘనవిజయాన్ని సాధించిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.

అనంతపురం రూరల్‌ మండలం కళ్యాణదుర్గం రోడ్డులోని నరిగమ్మ ఆలయం నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీలో వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ రహదారి–44 వరకు సాగిన ర్యాలీతో కళ్యాణదుర్గం రోడ్‌ జనసంద్రంగా మారింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

యువత పెద్ద ఎత్తున పాల్గొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు విద్రోహానికి రెండేళ్లు, వినాశనానికి రెండేళ్లు పూర్తయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు ‘సూపర్‌ తుస్‌’గా మారాయని ఆరోపించారు.

డ్వాక్రా రుణమాఫీ అమలు కాకపోగా మహిళా సంఘాలే కనుమరుగవుతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఇప్పటికే 25 శాతం డ్వాక్రా సంఘాలు రద్దయ్యాయని ఆరోపించారు. ఎన్టీఆర్‌తో ప్రారంభమైన చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు నేడు రాష్ట్ర ప్రజల గుండెలపై గాయాలు చేసే స్థాయికి చేరాయని విమర్శించారు.

నిరుద్యోగులను నిలువునా ముంచారని, యువగళం పేరుతో హామీలు ఇచ్చినా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరలేదని అన్నారు. రెండేళ్లలో రైతుల సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని విమర్శించారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతుంటే, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. వేరుశనగ మినహా ఇతర పంటలకు సరైన ధరలు లభించడం లేదన్నారు.

ఈ రెండేళ్లలో రాష్ట్రంలో అనేక మోసాలు, అన్యాయాలు జరిగాయని ఆరోపించారు. గతంలో జగనన్న ప్రభుత్వం డ్వాక్రా రుణాలను మాఫీ చేసిందని, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో డ్వాక్రా సంఘాలే మాఫీ అయ్యే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటికే 40 శాతం సంఘాలు నిర్వీర్యమయ్యాయని, రాష్ట్రవ్యాప్తంగా 25 శాతం సంఘాలు మూతపడ్డాయని ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో పేరూరు డ్యాం నీటిని తీసుకొచ్చి వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం తాగునీటి సమస్యలపై ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా స్పందన లేకుండా భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొన్ని పోలీస్‌ స్టేషన్లలో చట్టబద్ధ పరిపాలనకు బదులుగా పంచాయితీలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. మహిళలను అడ్డుపెట్టుకుని హనీట్రాప్‌ల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల ఆశీర్వాదంతో పేదలకు సేవ చేస్తానని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, ఫ్యాన్‌ గాలికి టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply