Kiran Abbavaram | 2 బాధ్యతలతో కిరణ్‌.. ఫ్లాపుల తర్వాత కొత్త స్టెప్

Kiran Abbavaram | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: పక్కింటి కుర్రాడిలా కనిపించే హీరో కిరణ్‌ అబ్బవరం ఇప్పుడు మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే హీరోగా, రచయితగా తనను తాను నిరూపించుకున్న కిరణ్‌ అబ్బవరం.. ఇప్పుడు కెరీర్‌లోనే అతిపెద్ద సవాల్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హీరోగానే కాకుండా, రాబోయే తన సినిమాతో దర్శకుడిగా కూడా మారబోతున్నారని సమాచారం.

జాయ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై చాగంటి సుధాకర్ నిర్మించబోతున్న ఈ సినిమాలో కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తనలోని మరో కోణాన్ని పరిచయం చేసేందుకు కిరణ్‌ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం రేపు జరగనున్నట్లు సమాచారం. దీంతో కిరణ్‌ అబ్బవరం కొత్త ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

ప్రస్తుతం కిరణ్‌ అబ్బవరం ‘క 2’, ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చెన్నై లవ్‌ స్టోరీ’ పాటలు, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు ‘క 2’ సినిమా పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో కిరణ్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

2025లో విడుదలైన కిరణ్‌ అబ్బవరం సినిమాలు ‘దిల్‌ రూబా’, ‘కే ర్యాంప్‌’ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో రాబోయే సినిమాలతో పాటు దర్శకుడిగా మొదలుపెట్టబోతున్న కొత్త ప్రయాణం కిరణ్‌ కెరీర్‌కు ఎలా కలిసివస్తుందో చూడాలి.