కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా కోనాపూర్ ప్రభుత్వ పాఠశాల..

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా కోనాపూర్ ప్రభుత్వ పాఠశాల..

  • విద్యార్థుల చేరికకు అధికారుల పిలుపు

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్ ఉన్నత పాఠశాలలో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కమ్మర్‌పల్లి మండల పంచాయతీ అధికారి మెరుగు సదాశివ్ పిలుపునిచ్చారు.

బుధవారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలలోనే అత్యుత్తమంగా 1:7 ఉపాధ్యాయ–విద్యార్థి నిష్పత్తి కోనాపూర్ పాఠశాలలో ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో బోధన నిర్వహిస్తున్నారని, వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ తరగతులు, వ్యక్తిగత బోధన అందిస్తున్నారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ హరిత విద్యాలయ పథకంలో కోనాపూర్ పాఠశాలకు 5-స్టార్ రేటింగ్ లభించడం గర్వకారణమని తెలిపారు. కళ్యాణలక్ష్మి, ఉపాధి హామీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి ప్రభుత్వ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నట్లే, ప్రభుత్వ పాఠశాలలను కూడా ఆదరించి విద్యార్థుల సంఖ్య పెరిగేలా సహకరించాలని కోరారు.

కోనాపూర్ గ్రామ సర్పంచ్ అరుణ్‌రెడ్డి మాట్లాడుతూ, తన ఐదేళ్ల గౌరవ వేతనాన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. బడి తోటలో పండించిన కూరగాయలను మధ్యాహ్న భోజన పథకంలో వినియోగించడం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోందన్నారు. పాఠశాలకు అవసరమైన ఏ సహాయమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అర్జున్ మాట్లాడుతూ, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఏఎన్‌ఎం శోభారాణి మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థులందరికీ సంవత్సరానికి రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తున్నామని తెలిపారు. దృష్టి సమస్యలు ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నామని, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి ఇంట్లో తయారైన ఆహార పదార్థాలు, ఆకుకూరలు, కాయగూరలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. 14 ఏళ్లు దాటిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వినోద్ మాట్లాడుతూ, విద్యార్థులందరికీ ప్రభుత్వ పథకాల కోసం అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా జారీ చేస్తున్నామని, పాఠశాలలో చేరిన వెంటనే వాటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్ మాట్లాడుతూ, పాఠశాల ప్రారంభ రోజున హాజరయ్యే ప్రతి విద్యార్థికి జనరల్ నాలెడ్జ్ పుస్తకం అందజేస్తామని తెలిపారు. అలాగే బాలురు, బాలికలకు ప్రత్యేక డ్రా ద్వారా రూ.1,000 విలువైన స్కూల్ బ్యాగులను బహుమతిగా అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోర్తాడు ఉదయ్, పంచాయతీ కార్యదర్శి నవీన్, వార్డు సభ్యులు, వివిధ గ్రామ, మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.