ఓటర్ల మ్యాపింగ్ తప్పనిసరి..

ఓటర్ల మ్యాపింగ్ తప్పనిసరి..

  • జూన్ 14లోపు వివరాలు సమర్పించాలని ఆర్డీఓ రామ్మోహన్ సూచన
  • మ్యాపింగ్ ప్రక్రియలో ఓటర్లు భాగస్వామ్యం కావాలని పిలుపు
  • ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్‌ఓలకు ఆదేశాలు

తిరుపతి, ఆంధ్ర‌ప్ర‌భ : చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 2026 ఓటరు జాబితాలో ఉన్న ఓటర్లు 2002 సంవత్సరపు ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేసుకోవాలని తిరుపతి ఆర్డీఓ, చంద్రగిరి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి రామ్మోహన్ సూచించారు. మంగళవారం తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో నిర్వహిస్తున్న ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రస్తుత ఓటర్ల వివరాలను 2002 సంవత్సరపు ఓటరు జాబితాతో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు ఓటర్లు స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని కోరారు. మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి పూర్తి చేయాలని బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌ఓలు) సూచించారు. ఇప్పటివరకు మ్యాపింగ్ చేసుకోని ఓటర్లు జూన్ 14వ తేదీలోపు తప్పనిసరిగా తమ వివరాలను సంబంధిత బూత్ లెవల్ అధికారుల వద్ద సమర్పించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓటరు జాబితా పరిశుభ్రత, ఖచ్చితత్వం కోసం ఈ మ్యాపింగ్ ప్రక్రియ కీలకమని పేర్కొన్న ఆయన, ప్రతి అర్హ ఓటరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు.