కాజు కిలో రూ.30. ఇది నిజమా..?
కాజు కిలో రూ.30. ఇది నిజమా..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : జీడిపప్పు కిలో రూ.30 నుంచి రూ.50కే దొరికే గ్రామం ఉందని మీకు తెలుసా.. జీడిపప్పు అంటే చాలా మందికి అమ్మో చాలా ఖరీదైన ఆహారం అని గుర్తుకొస్తుంది. మార్కెట్లో కిలో రూ.800 నుంచి రూ.1000 వరకు ధర పలికే జీడిపప్పు, ఒక గ్రామంలో మాత్రం కూరగాయల ధరకు అమ్ముతారు. కూరగాయలు రోడ్డు పై అమ్మిన విధంగానే జీడిపప్పు అమ్ముతారు. జార్ఖండ్ రాష్ట్రంలోని జామ్తారా జిల్లాకు సమీపంలో ఉన్న “నాలా” అనే గ్రామం ఈ ప్రత్యేకతకు నిలయం. దీనిని “జార్ఖండ్ జీడిపప్పు సిటీ” అని కూడా పిలుస్తారు. ఈ గ్రామంలో పెద్ద ఎత్తున జీడిపప్పు సాగు జరుగుతుంది.
దాదాపు 500 ఎకరాల్లో పండే జీడిపప్పులను స్థానికులు రోడ్ల పక్కనే విక్రయిస్తుంటారు. మార్కెట్ సదుపాయాలు, రవాణా అవకాశాలు పరిమితంగా ఉండటంతో తమ వద్దకు వచ్చే కొనుగోలుదారులకు చాలా తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. అక్కడి జీడిపప్పును మధ్యవర్తులు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో అనేక రెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక వైపు రైతు తన ఉత్పత్తిని చవకగా అమ్ముకోవాల్సి వస్తుంటే, మరో వైపు వినియోగదారుడు అదే వస్తువుకు భారీ ధర చెల్లించాల్సి వస్తోంది. రైతు నుంచి వినియోగదారుడి వరకు ఉన్న మార్కెటింగ్ వ్యవస్థలోని అసమానతలకు ఇది ఒక చక్కటి ఉదాహరణ.
