Congress | 100 సీట్లతో అధికారంలోకి వస్తాం…
Congress |100 సీట్లతో అధికారంలోకి వస్తాం…
Congress | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, విద్యార్థులను పూర్తిగా నిరాశపరిచిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పెద్దపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి కీలక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని హరీశ్‌రావు ఆరోపించారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఎరువుల సరఫరాలో విఫలమైందని, ఫలితంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 11 విడతల్లో రూ.73 వేల కోట్లను రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో జమ చేసిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకానికి ఎగనామం పెట్టిందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ కోసం రూ.35 వేల కోట్లు అవసరమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, బడ్జెట్‌లో కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని హరీశ్‌రావు విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎప్పుడూ ఎరువుల కొరత రాలేదని, రైతులు వ్యవసాయ పనులు సజావుగా చేసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం రైతులు ఎరువుల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతు బీమా పథకం అమలు నిలిచిపోయిందని హరీశ్‌రావు విమర్శించారు. రైతు కుటుంబాలకు భరోసా కల్పించిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.
రైతులు పండించిన మక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, దీంతో రైతులు స్వయంగా బస్తాలు కొనుగోలు చేసి పంటను నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కళ్లాల్లో ధాన్యం పేరుకుపోయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
