విశాఖపట్నం – ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ – 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో అకడెమిక్ సెనేట్ హాలులో ఈ ఫలితాలను మంగళవారం ఆయన విడుదల చేశారు. మే 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఐసెట్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పరీక్షల కీని విడుదల చేసిన విషయం విధితమే.
అభ్యర్థులు తమ ఫలితాలను ఇలా తనిఖీ చేసుకోవచ్చు..
1) అధికారిక వెబ్ సైట్
https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx
ని సందర్శించాలి.
2) హోమ్ పేజీలో ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
3) రిజిస్ట్రేషన్ ఐడీ, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి.. మీ లాగిన్ ఆధారాలను నమోదు చేసి.. నిర్థారించుకోవాలి.
4) పరీక్ష ఫలితం ర్యాంక్ కార్డు రూపంలో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
5) ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోండి
కాగా, ఈ ఏడాది ఐసెట్ పరీక్షకు మొత్తం 37,572 మంది దరఖాస్తు చేసుకోగా, 34,131 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 32,719 మంది అర్హత సాధించారు. అంటే, ఉత్తీర్ణతా శాతం 95.86%గా నమోదైంది.
మీ ఉజ్వల భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు: నారా లోకేశ్
ఈ సందర్భంగా రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. “ఏపీ ఐసెట్ లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు. ఫలితాలు ఇప్పుడు https://cets.apsche.ap.gov.in/ICET , వాట్సాప్ గవర్నెన్స్ నెం. 9552300009 లో అందుబాటులో ఉన్నాయి. మీ ఉజ్వల విద్యా భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.
ఐసెట్-2025 టాపర్ల వివరాలు ఇలా ఉన్నాయి…
మేకా మనోజ్ 197.91 మార్కులతో మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా, డి. సందీప్ రెడ్డి 179.51 మార్కులతో రెండో ర్యాంకు, ఎస్. కృష్ణ సాయి 178.51 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. అలాగే, వల్లూరి సాయిరామ్ సాత్విక్ 175.69 మార్కులతో నాలుగో ర్యాంకు, రావూరి మాధుర్య 175.45 మార్కులతో ఐదో ర్యాంకును దక్కించుకున్నారు.
కాగా, మే 10వ తేదీన ప్రాథమిక ‘కీ’ ని విడుదల చేసి, మే 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించారు. వచ్చిన అభ్యంతరాలను నిపుణుల బృందం పరిశీలించి, తుది ‘కీ’ ని రూపొందించింది. ఈ తుది ‘కీ’ ఆధారంగానే ఫలితాలను వెల్లడించారు. అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. తదుపరి అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి త్వరలో విడుదల చేయనుంది.