భూమిని కాపాడితేనే భవిష్యత్ పంటలకు భరోసా..

భూమిని కాపాడితేనే భవిష్యత్ పంటలకు భరోసా..

‘ఖేత్ బచావో అభియాన్’కు విశేష స్పందన

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం మానుకుని, భూమికి పుష్టినిచ్చే సేంద్రియ, జీవన ఎరువుల వాడకంపై దృష్టి సారించాలని వంశధార ప్రాజెక్టు చైర్మన్ అరవల రవీంద్రబాబు పిలుపునిచ్చారు.

నైర వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ (పొలాలను సంరక్షించే ప్రచార కార్యక్రమం)లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పంట భూముల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ద్వారా రాబోయే తరాలకు సారవంతమైన భూములను అందించాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు.

గ్రామ సర్పంచ్ అరవల ప్రతాప్ మాట్లాడుతూ, రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని, వాటి నివేదికల ఆధారంగా అవసరమైన మేరకే ఎరువులను వినియోగించాలని సూచించారు.

గ్రామ పెద్ద కర్రి కృష్ణమోహన్ మాట్లాడుతూ, పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువుల వినియోగం ద్వారా భూమి జీవశక్తిని కాపాడుకోవచ్చని తెలిపారు.

అవగాహన ర్యాలీతో సందేశం

ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాలకు చెందిన 150 మంది విద్యార్థులు, స్థానిక రైతులు కలిసి నైర గ్రామంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. భూసార పరిరక్షణ, పొలాల సంరక్షణపై నినాదాలు చేస్తూ గ్రామస్థుల్లో చైతన్యం కల్పించారు.

అనంతరం విద్యార్థులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ, సమగ్ర ఎరువుల వినియోగం, భూసార పరీక్షల ప్రాముఖ్యత, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అధ్యాపకులు పి. ఉపేంద్రరావు, పి. గురుమూర్తి, డి. చిన్నంనాయుడు, జె. జగన్నాధం, ఎస్. గోవిందరావు, కె. రవికుమార్, హేమంత్ కుమార్, గ్రామ కార్యదర్శి మోనిక, వీఏఏ శశిధర్, ప్రకృతి వ్యవసాయ సమన్వయకర్త, ఫీల్డ్ అసిస్టెంట్లు, వ్యవసాయ విద్యార్థులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.