మోడల్ సిటీగా శ్రీకాకుళంను అభివృద్ధి చేస్తాం..

మోడల్ సిటీగా శ్రీకాకుళంను అభివృద్ధి చేస్తాం..

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకం అవ్వాలంటే పార్కులే ప్రధాన వనరు అని, అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల స్పూర్తితో పార్కులను శ్రీకాకుళం నగరంలో అభివృద్ది చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గూనపాలెం, హడ్కో కాలనీ, ఆర్కె నగర్, అబ్దుల్ కలాం పార్క్ అఫిషియల్ కాలనీ లను సందర్శించి 2 కోట్ల ఎయిర్పోర్ట్ అధారిటీ సి.ఎస్.ఆర్ నిధులతో నిర్మించనున్న పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడివారితో మాట్లాడి స్థానిక అవసరాలకు వీలుగా.. పార్కు నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టరుకు పలు సూచనలు చేశారు.

ఈ సంధర్భంగా మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆలోచనల నుండి స్ఫూర్తి పొంది శ్రీకాకుళం నగరంలో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కొద్ది నెలల క్రితం ప్రారంభించిన కార్గిల్ పార్క్.. నగర ప్రజలకు అంతులేని ఆహ్లాదాన్ని చేరువ చేసిందని తెలిపారు. కార్గిల్ పార్క్ లాంటి ప్రాంతాలు.. శ్రీకాకుళం నగరంలో ఇంకా అనేకం అభివృద్ధి చెయ్యాలని స్థానికుల కోరిక మేరకు ఈరోజు నాలుగు పార్కులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ప్రతీ పార్కు లో వాకింగ్ ట్రాక్, కిడ్స్ ప్లే ఏరియా, జిమ్ తో పాటు స్థానికుల అవసరాలకు తగ్గట్టుగా స్కేటింగ్ ట్రాక్, వాలీబాల్, బాడ్మింటన్ కోర్టులను నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. 3 నెలల్లో పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు.

మోడల్ సిటీగా శ్రీకాకుళం ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇతర అధికార బృందానికి అభినందనలు తెలిపారు. గూన పాలెం పార్క్ కు 40 లక్షలు, హడ్కో కాలనీ పార్క్ కి 55 లక్షలు, ఆర్కె నగర్ పార్క్ కు 45 లక్షలు, అఫిషియల్ కాలనీ పార్క్ కు 60 లక్షలు.. మొత్తంగా 2 కోట్ల ఎయిర్పోర్ట్ అధారిటీ సి.ఎస్.ఆర్ నిధులతో పార్కులను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా స్థాయి అధికారులు, కార్పొరేషన్ అధికారులు, కూటమి శ్రేణులు భాగస్వామ్యం అయ్యారు.