RTC Bus Fire | కిటికీల్లోంచి దూకిన ప్రయాణికులు

RTC Bus Fire | కిటికీల్లోంచి దూకిన ప్రయాణికులు

ఆర్టీసీ బస్సులో మంటలు..

RTC Bus Fire | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు, పొగలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. జగ్గయ్యపేట నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

గొల్లపూడి సమీపానికి చేరుకున్న సమయంలో బస్సు ఇంజిన్ భాగంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు, పొగలు రావడం ప్రారంభమైంది. పరిస్థితిని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కకు ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశారు.

మంటలు కనిపించగానే ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కొందరు తలుపుల ద్వారా బయటకు దిగగా, మరికొందరు ప్రాణభయంతో కిటికీల్లోంచి దూకి బయటపడ్డారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఎండల కారణంగా ఇంజిన్ అధికంగా వేడెక్కి షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.