Lokesh | రైల్వే రంగంలో పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం..

Lokesh | రైల్వే రంగంలో పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం..

  • టీఎంహెచ్‌తో లోకేశ్ కీలక భేటీ

సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు (SPIEF-2026) సందర్భంగా ప్రపంచంలోని అతిపెద్ద రైలు మొబిలిటీ, రోలింగ్ స్టాక్ తయారీ సంస్థల్లో ఒకటైన ట్రాన్స్‌మాష్‌హోల్డింగ్ (TMH) ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక సమావేశం నిర్వహించారు.

భారతీయ రైల్వేలకు 120 వందే భారత్ స్లీపర్ రైలు సెట్ల తయారీ, నిర్వహణ కోసం ఎంపికైన ఇండో-రష్యన్ జాయింట్ వెంచర్ కైనెట్ రైల్వే సొల్యూషన్స్‌లో టీఎంహెచ్ భాగస్వామిగా ఉందని లోకేశ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో రైల్వే విడిభాగాల అసెంబ్లీ యూనిట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని టీఎంహెచ్ ప్రతినిధులను ఆహ్వానించారు. ఇప్పటికే అక్కడ ఉన్న అల్స్టోమ్ పారిశ్రామిక వ్యవస్థను ఉపయోగించుకోవడంతో పాటు, ఫ్రైట్ లోకోమోటివ్‌లు, వ్యాగన్ తయారీ, స్మార్ట్ సిగ్నలింగ్, మెట్రో సాంకేతికతలు, రైల్వే పరిశోధన, ఇంజినీరింగ్ నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించినట్లు వెల్లడించారు.

భారతదేశం రైల్వే నెట్‌వర్క్‌ను వేగంగా ఆధునీకరిస్తున్న నేపథ్యంలో, రైల్వే తయారీ, ఆవిష్కరణలు, ఎగుమతులకు ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రంగా మారే సామర్థ్యం కలిగి ఉందని లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక విధానాలు, వ్యూహాత్మక భౌగోళిక స్థానం పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

రైల్వే రంగంలో ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను తయారీ, సాంకేతిక ఆవిష్కరణల హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు.