పునః ప్రారంభమైన పుణ్యనదీ హారతులు..

పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు హారతులు..
లాంచనంగా ప్రారంభించిన దుర్గ గుడి దేవస్థానం..
పాల్గొన్న దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ట్రస్ట్ బోర్డు సభ్యులు
కృష్ణ,గోదావరి సంగమ తీరంలో ఆధ్యాత్మిక వైభవం

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద పుణ్యనదీ హారతుల కార్యక్రమం గురువారం సాయంత్రం లాంఛనంగా పునః ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర, ప్రజా సంక్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నదీమతల్లికి పసుపు, కుంకుమలు, పట్టు వస్త్రాలు సమర్పించగా, వైదిక సిబ్బంది పంచహారతులు సమర్పించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మాట్లాడుతూ ఆలయాలు, నదుల ప్రాధాన్యం భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రి ఆలయం ద్వారా పుణ్యనదీ హారతులను మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.