Electricity | పొదుపుగా వినియోగించాలి..

Electricity | పొదుపుగా వినియోగించాలి..

Electricity | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : సహజ ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పై ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ (Sumith Kumar) అన్నారు. మంగళవారం ఉదయం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని కట్టమంచి వివేకానంద విగ్రహం నుంచి గాంధీ సర్కిల్ వరకు నిర్వహించిన విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector) మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ విద్యుత్తును బాధ్యతాయుతంగా వినియోగిస్తే అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ పొదుపు రంగంలో మంచి ఫలితాలు సాధిస్తున్నదని పేర్కొన్నారు. జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద 200 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. అందరూ కలిసి కృషి చేస్తే విద్యుత్ పొదుపు ద్వారా 5000 మెగావాట్ల వరకు ఆదా చేయవచ్చని వెల్లడించారు.

Electricity

ప్రభుత్వ భవనాలలో పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్‌ను వినియోగంలోకి తీసుకురావచ్చని, దీని వల్ల విద్యుత్ (Electricity) ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. విద్యుత్ పొదుపును లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఆదా చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థులు, విద్యార్థినీలకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. పీఎం సూర్యఘర్ స్టాల్స్ ద్వారా సోలార్ విద్యుత్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు రూఫ్‌టాప్ సోలార్‌పై సబ్సిడీ కూడా అందజేస్తామని వివరించారు.

విద్యుత్ పొదుపుపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విద్యుత్ సంరక్షణ భవిష్యత్ రక్షణ, విద్యుత్ పొదుపు చేద్దాం భావితరాలకు వెలుగునిద్దాం, విద్యుత్ పొదుపు రేపటి మదుపు, ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే రెండు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తితో సమానం, విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు, సౌర విద్యుత్ వాడుదాం ప్రకృతిని కాపాడుదాం, సౌర విద్యుత్ వాడుదాం కాలుష్యాన్ని నియంత్రిద్దాం, సౌర విద్యుత్ (Soura Eclectricity) వాడుదాం విద్యుత్ చార్జీలను నియంత్రిద్దాం.. ఇంటింటా విద్యుత్ పొదుపు ఊరూరా వెలుగు, సేవ్ పవర్ సేవ్ నేషన్ వంటి నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ పి. అయ్యుబుఖాన్, ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, విద్యుత్ శాఖ అధికారులు మునిచంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply