Palnadu | పల్నాడులో తగ్గుతున్న ఆడ శిశువుల జననాలు

  • గ‌ణాంకాల‌లో ఆడ‌పిల్ల‌ల‌కంటే.. మ‌గ‌వారే ఎక్కువ‌
  • త‌ప్ప‌ని తెలిసిన ఆగ‌ని భ్రూణహత్యలు
  • భ‌విష్య‌త్తులో త‌ప్ప‌ని సామాజిక సంక్షోభం

పల్నాడు బ్యూరో, ఆంధ్రప్రభ : నేటి ఆధునిక కాలంలో వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందినా, సమాజంలో మూఢ విశ్వాసాలు, అశాస్త్రీయ ధోరణులు మాత్రం ఇంకా మారడం లేదు. పేదరికం ఒకవైపు, ఆడబిడ్డ పుడితే భారం అనే సంకుచిత మనస్తత్వం మరోవైపు.. వెరసి కడుపులోనే చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కేంద్ర జనగణన విభాగం విడుదల చేసిన ‘పౌర నమోదు వ్యవస్థ –2024’ నివేదిక పల్నాడు జిల్లాలో నెలకొన్న ఆందోళనకు అద్దం పడుతోంది.

లెక్క‌లు చెబుతున్న నిజాలు..

సీఆర్‌ఎస్‌-2024 నివేదిక ప్రకారం.. పల్నాడు జిల్లాలో ఆడపిల్లల కంటే మగపిల్లల జననం గణనీయంగా ఎక్కువగా ఉంది. జిల్లాలో నమోదైన మొత్తం 27,807 జననాలలో, మగ శిశువులు 14,438 మంది ఉండగా, ఆడ శిశువులు 13,369 మంది మాత్రమే ఉన్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే, మగ శిశువులతో పోల్చితే ఆడ శిశువుల జననం మొత్తంగా 92.59 శాతానికి మాత్రమే పరిమితమైంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా 87.34 శాతానికే పడిపోవడం గమనార్హం.

జిల్లాలో నమోదైన జననాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3,273 మంది శిశువులు జన్మించారు. వీరిలో 1,747 మంది మగ శిశువులు, 1,526 మంది ఆడ శిశువులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 24,534 జననాలు నమోదయ్యాయి. అందులో 12,691 మంది మగ శిశువులు, 11,843 మంది ఆడ శిశువులు ఉన్నారు. మొత్తం జిల్లాలో 14,438 మంది మగ, 13,369 మంది ఆడ శిశువులు జన్మించారు.

క‌డుపులోనే క‌డ‌తెరుస్తున్నారు..

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, నిషేధమని తెలిసినా జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయనే ఆరోపణలు గతంలో వినిపించిన సందర్భాలు ఉన్నాయి. లింగ నిష్పత్తిలో కనిపిస్తున్న ఈ వ్యత్యాసంపై నిపుణులు పలు కారణాలను ప్రస్తావిస్తున్నారు. అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు కూడా కారణాలుగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. వైద్య రంగంలో ఎంత అభివృద్ధి సాధించినా, ఇటువంటి చర్యల వ‌ల్ల శిశు మరణాలు, ముఖ్యంగా ఆడ శిశువుల మరణాల రేటు ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు.

భవిష్యత్తుపై ప్ర‌భావం..

లింగ నిష్పత్తిలో వస్తున్న ఈ భారీ వ్యత్యాసం కేవలం గణంకాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఈ వ్యత్యాసం కొనసాగితే భవిష్యత్తులో సామాజిక ప్రభావాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పెళ్లికాని యువకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ‘అమ్మాయి దొరకడం’ అనేదే ఒక పెద్ద సవాలుగా మారుతున్న తరుణంలో, వివాహ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అసమతుల్యత వల్ల తలెత్తే పరిణామాలు కేవలం కుటుంబాలకే పరిమితం కావు, వీటి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటుంది.

సమాజంలో పురుషుల సంఖ్య పెరిగి, స్త్రీల సంఖ్య దారుణంగా తగ్గిపోతే, అది మహిళల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుంది. అక్రమ రవాణా , మహిళలపై దాడులు, వేధింపులు, బలవంతపు వివాహాలు వంటి సామాజిక రుగ్మతలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభాలో స్త్రీ-పురుష నిష్పత్తిలో తీవ్ర అసమతుల్యత ఏర్పడితే, అది సామాజిక సంఘర్షణకు దారితీస్తుంది. పెళ్లి చేసుకోలేని పురుషులు నిరాశకు గురై, తప్పుడు మార్గాల్లోకి మళ్ళే ప్రమాదం ఉంది, ఇది శాంతిభద్రతలపైనా ప్రభావం చూపే అవకాశాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు.

కుటుంబ వ్యవస్థే సమాజానికి మూలం. అమ్మాయిలు లేని సమాజంలో తర్వాతి తరం పుట్టుకకు, పిల్లల పెంపకానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఇది జనాభా క్షీణతకు మాత్రమే కాకుండా, మానవీయ విలువలు , భావోద్వేగ సంబంధాల క్షీణతకు కారణమవుతుంది. వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల ఆర్థికంగా కూడా అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు కనుమరుగై, ఒంటరితనం పెరిగి, వృద్ధాప్యంలో రక్షణ కరవయ్యే పరిస్థితి రావచ్చు. సమాజంలో ఉన్న ఈ ‘స్త్రీ శిశువుల కరవు’ను అరికట్టకపోతే, మనం నిర్మించుకున్న ఈ ఆధునిక వ్యవస్థ భవిష్యత్తులో తీవ్ర గందరగోళానికి గురికాక తప్పదు. లింగ సమానత్వాన్ని కేవలం నినాదాలకే పరిమితం చేయకుండా, ఆడపిల్లల ప్రాణాలను కాపాడుకోవడమే నేటి తక్షణ కర్తవ్యం.