రెవెన్యూ, రీ-సర్వే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
రెవెన్యూ, రీ-సర్వే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడం, రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలో శ్రీకారం చుట్టినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తొలి సమావేశం శుక్రవారం గుడిపాల మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఎఫ్వో సుబ్బరాజు, ఆర్టీవో శ్రీనివాసులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. మ్యుటేషన్లు, జాయింట్ ఎల్పీఎం, సర్వే దిద్దుబాట్లు, మ్యాప్ లైన్ సవరణలు, దారి వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు.
గ్రామాల్లో పెండింగ్లో ఉన్న సమస్యలను గుర్తించి అవసరమైతే ప్రత్యక్షంగా గ్రామాలను సందర్శించి ప్రజలకు సరైన మార్గదర్శకత్వం అందించాలని చెప్పారు. రీ-సర్వే ప్రక్రియకు సంబంధించిన ఫిర్యాదులు ఇంకా కొన్ని గ్రామాల్లో కొనసాగుతున్నాయని, వాటి పరిష్కారానికి అధికారులు వ్యవస్థబద్ధంగా పనిచేసి ఒకటి నుంచి రెండు నెలల్లో గణనీయమైన పురోగతి సాధించాలని సూచించారు.
రీ-సర్వే జరగనున్న గ్రామాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, చిన్న పొరపాట్లు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు తమ లాగిన్లలో ఉన్న అధికారాలను సమర్థవంతంగా వినియోగించి మ్యుటేషన్లు, రికార్డుల నవీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని తెలిపారు.
రీ-సర్వే కార్యక్రమం ప్రజల ఆస్తి హక్కులతో ముడిపడి ఉన్న అత్యంత కీలక ప్రక్రియ అని, ఇందులో జరిగే తప్పిదాలు సంవత్సరాల తరబడి వివాదాలకు కారణమవుతాయని పేర్కొన్నారు. తహసీల్దార్లు తమ పరిధిలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోల వద్దకు వచ్చిన ఫిర్యాదులను క్రమం తప్పకుండా సమీక్షించి, ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యల నివేదికను వారంలోపు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కుటుంబ విభజనలు, భూసరిహద్దు వివాదాలు వంటి సంక్లిష్ట అంశాల్లో సంబంధిత పక్షాలకు తగిన సూచనలు అందించి నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రీ-సర్వే ప్రక్రియను నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయడానికి ప్రతి అధికారి ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
మరో 15 రోజుల తర్వాత మండల స్థాయిలో మళ్లీ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి పురోగతిని సమీక్షిస్తామని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల సంఖ్యను గణనీయంగా తగ్గించే దిశగా అధికారులు కృషి చేయాలని ఆకాంక్షించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి అర్జీలు పెండింగ్లో లేకుండా చూడడం, సమస్యలేని గ్రామాలుగా తీర్చిదిద్దడం, ప్రజా సేవలను ఇంటి వద్దకే చేర్చడం, పీజీఆర్ఎస్లో అందిన వినతులు, ఫిర్యాదులను నెల రోజుల్లో పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఒకే సమస్యపై ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారాలు చూపించడం, కోర్టు వివాదాలను తగ్గించడం, ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు.
గుడిపాల మండలంలోని చిత్తపార, డీబీ పల్లి, నంగమంగళం, మొగరాలపల్లి, కుప్పిగానిపల్లి, పాపసముద్రం, వసంతపురం, ముత్తుకూరుపల్లి, మరకాలకుప్పం, బందార్లపల్లి, కృష్ణ జన్నాపురం, లక్ష్మంబాపురం, పశుమంద గ్రామాల్లో రీ-సర్వే కార్యక్రమం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుడిపాల ఎంపీపీ హరిప్రసాద్ చౌదరి, తహసీల్దార్ శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బనాయుడు, రెవెన్యూ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
