పర్యావరణ పరిరక్షణే లక్ష్యం..

సీఐ రాంబాబు హరిత సందేశం

బాపట్ల, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని బాపట్ల పట్టణ సీఐ రాంబాబు అన్నారు.

అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ బాపట్ల పట్టణ అధ్యక్షుడు బ్రహ్మాండం బాలనారాయణ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయ ప్రాంగణంలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ రాంబాబు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్లోబల్ వార్మింగ్, అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు.

మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ర రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు మామిడి రమేష్ కుమార్, రూరల్ మండల అధ్యక్షుడు పేరిరెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అడపాల శ్రీరామయ్య, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply