Amaravati Farmers | రాజధాని పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు – జగన్
Amaravati Farmers | రాజధాని పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు – జగన్
Amaravati Farmers | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని అమరావతికి చెందిన పలువురు రైతులు కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ను కలిసిన రైతులు, భూసేకరణ పేరుతో తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
భూములను లాక్కునేందుకు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నదాతలు జగన్ ముందు వాపోయినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అమరావతి రాజధాని పేరుతో స్కామ్‌లు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఇప్పటికే రాజధాని కోసం రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ అదనంగా భూములు కావాలని చెబుతున్నారని ఆయన విమర్శించారు.
రైతుల అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్లాలని జగన్ సూచించారు. భూముల విషయంలో రైతులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు. రాజధాని అభివృద్ధి పేరుతో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని ఆయన అన్నారు.
అమరావతి భవిష్యత్తుపై కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాజధాని లేకుండా చేసేలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని నిర్మాణం, భూసేకరణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. మాజీ సీఎంను కలిసిన వారిలో ప్రధానంగా ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు అధికంగా ఉన్నట్లు సమాచారం.
