పవిత్ర సంగమంలో మళ్లీ ‘కృష్ణవేణి నదీ నవహారతులు’

పవిత్ర సంగమంలో మళ్లీ ‘కృష్ణవేణి నదీ నవహారతులు’

జూన్ 5 నుంచి పునఃప్రారంభానికి సన్నాహాలు
క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్
టెంపుల్ టూరిజం అభివృద్ధికి దేవస్థానం ప్రత్యేక చర్యలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధి లక్ష్యంగా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం (ఫెర్రీ ఘాట్) వద్ద నిర్వహించే ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి పునఃప్రారంభించేందుకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఏర్పాట్లు వేగవంతం చేసింది.

ఈ నేపథ్యంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్ సోమవారం సాయంత్రం పవిత్ర సంగమం వద్ద క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు, దేవస్థానం అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సహాయ కమిషనర్‌తో కలిసి హారతుల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, భక్తుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు కృష్ణానది తీర ప్రాంత పర్యాటకాభివృద్ధికి మరింత ఊతం లభించనుందని అధికారులు పేర్కొన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా, సాంప్రదాయబద్ధంగా నవహారతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం వర్గాలు వెల్లడించాయి.

కృష్ణా నదీ తీరాన జరిగే ఈ వైభవోపేత కార్యక్రమం పునఃప్రారంభం కానుండటంతో భక్తుల్లో, పర్యాటకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Leave a Reply