సీఎంను కలిసిన దళిత రత్న అవార్డు గ్రహీత..
జైనూర్, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కొటారి గ్రామంలో సోమవారం సాయంత్రం దళిత రత్న అవార్డు గ్రహీత, తెలంగాణ మాంగ్ సమాజ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు మావలే దత్త మాంగ్ కలిశారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ ఆసిఫాబాద్ చైర్మన్ రమేశ్‌తో కలిసి ముఖ్యమంత్రిని కలిసినట్లు పేర్కొన్నారు. క్రాంతివీర్ లహుజీ సాల్వే జీవిత చరిత్ర పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని దళితుల సమస్యలను పరిష్కరించాలని, దళిత రైతులు సాగు చేస్తున్న భూములకు పహాణీలు మంజూరు చేయాలని, రైతు భరోసా అందించాలని కోరినట్లు తెలిపారు. అలాగే మారుమూల ప్రాంతాల్లో వంతెనలు, రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
తమ వినతులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని మావలే దత్త మాంగ్ తెలిపారు.
