Reimbursement | ధాన్యం రోడ్లపై.. ప్రభుత్వం నిద్రలో..
Reimbursement | ధాన్యం రోడ్లపై.. ప్రభుత్వం నిద్రలో..
Reimbursement | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రైస్ మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైందని రాంచందర్‌రావు ఆరోపించారు. వడ్లను కేంద్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయదని, రాష్ట్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రమే రీయింబర్స్మెంట్ అందిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంత మేర పంట ఉత్పత్తి అయిందనే సమాచారాన్ని కేంద్రానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ధాన్యం ఇప్పటికీ రోడ్లపై కుప్పలుగా పడి ఉందని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ చేపట్టిన ఆందోళనల కారణంగానే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపుతోందని రాంచందర్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రేపు ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్లు రాంచందర్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నాయకత్వం హాజరుకానుందని చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై వెలిసిన పోస్టర్లకు బీజేపీలో అంతర్గత విభేదాలకు ఎలాంటి సంబంధం లేదని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొందరు ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికే డీజీపీ, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని, బాధ్యులపై పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
