చిట్యాల ఫస్ట్ వార్డులో తాగునీటి విలవిల

చిట్యాల ఫస్ట్ వార్డులో తాగునీటి విలవిల
- వారం రోజులుగా బంద్ అయిన వాటర్ ప్లాంట్
- ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల్లో విద్యుత్ శాఖ, మున్సిపల్ అధికారుల,ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం..
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు శివనేనిగూడెంలో తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. గత వారం రోజులుగా స్థానిక ట్రాన్స్‌ఫార్మర్ పనిచేయకపోవడంతో అటు రైతాంగం, ఇటు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలోని బోరు మోటర్లు నడవక పంటలు వేసే సమయంలో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.. అదే కరెంటు కనెక్షన్‌తో నడిచే స్థానిక వాటర్ ప్లాంట్ పూర్తిగా మూతపడింది.
ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండటంతో నీటి అవసరం విపరీతంగా పెరిగింది. అలాంటిది వారం రోజులుగా వాటర్ ప్లాంట్ బంద్ కావడంతో ఫస్ట్ వార్డు ప్రజలు తాగడానికి నీరు లేక విలవిలలాడుతున్నారు. సొంతంగా బండ్లు, వాహనాలు ఉన్నవారు చిట్యాల టౌన్‌కు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటుండగా ఎలాంటి ఆసరా లేని ముసలివాళ్లు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతదూరం వెళ్లి నీళ్లు తెచ్చుకునే శక్తి లేక, తాగడానికి నీరు దొరకక ఈ ఎండాకాలంలో నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ తీవ్రమైన సమస్యపై గ్రామ యువకులు, స్థానికులు ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారుల, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రం “చూస్తాం.. చేస్తాం” అంటూ వారం రోజులుగా కాలయాపన చేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు. ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటి విషయంలో ఇంత నిర్లక్ష్యం తగదని స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యుద్ధప్రాతిపదికన కరాబైన ట్రాన్స్‌ఫార్మర్‌ను రిపేర్ చేయించి, వాటర్ ప్లాంట్‌ను పునరుద్ధరించాలి అని ,విద్యుత్ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే, ఫస్ట్ వార్డు ప్రజలందరూ మున్సిపల్ ఆఫీస్ ముందు భారీ ధర్నాకు దిగుతామని హెచ్చరించారు మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
