Target America | చైనా సైనిక విస్తరణపై అమెరికా హెచ్చరికలు

Target America | చైనా సైనిక విస్తరణపై అమెరికా హెచ్చరికలు

Target America | హామీ అణు సైలో సమీపంలో చైనా భారీ నిర్మాణాలు
అమెరికా నగరాలను చేరుకునే సామర్థ్యం ఉన్న డీఎఫ్‌-41 క్షిపణులు
ప్రపంచ శక్తి సమతుల్యంపై ప్రభావం
ఇండో-పసిఫిక్‌లో ఆధిపత్యంపై ఆందోళన

Target America | బీజింగ్‌/సింగపూర్‌: ఎడారిలో న్యూక్లియర్‌ మిసైల్‌ సైలో సమీపంలో చైనా లాంచ్‌ ప్యాడ్లు నిర్మిస్తోందని ఉపగ్రహ చిత్రాలు వెల్లడి చేశాయి. ఇలాంటి విస్తృత నిర్మాణం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని నిపుణులు వ్యాఖ్యానించారు. రాయిటర్స్‌ సమీక్షించిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం, చైనా వాయువ్య ప్రాంతంలోని హామీ అణు సైలో ఫీల్డ్‌ సమీపంలో 80కి పైగా లాంచ్‌ ప్యాడ్లు, బంకర్లు, కమ్యూనికేషన్‌ నోడ్లు, వైమానిక స్థావరాలు, రైలు మార్గాల నిర్మాణాలు గత ఆరు సంవత్సరాలుగా జరుగుతున్నాయి.

రెండు పెద్ద అష్టభుజాకార నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో సైనికుల వసతి, పెద్ద వాహనాల నిల్వ, ఆయుధాగారాలు ఉన్నాయి. ఇవి హామీ సైలోస్‌ నుంచి 140 కిలోమీటర్లు, 230 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో డీఎఫ్‌-41 వంటి సుదీర్ఘశ్రేణి అణు క్షిపణులు ఉన్నాయి. ఇవి అమెరికాలోని ఏ నగరాన్నైనా చేరుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

విస్తృత నెట్‌వర్క్‌ చైనా మొబైల్‌ క్షిపణి లాంచర్లు, వాయు రక్షణ వ్యవస్థల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి దాడి నుంచి తమ అణు శక్తిని కాపాడుకుని ప్రతీకార చర్య తీసుకునేలా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా ఇప్పటికే వందలాది అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. 2030 నాటికి 1,000 ఆయుధాల వరకు పెంచాలని లక్ష్యం.

ఈ నిర్మాణాలు షిన్‌జియాంగ్‌ ప్రాంతంలోని నిర్జన ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇవి చైనా అణు బలగాల అమ్ములపొదిని మరింత బలోపేతం చేస్తాయి. అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రపంచ శక్తి సమతుల్యాన్ని మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా ఇప్పటికే సముద్రం నుంచి, విమానాల నుంచి కూడా అణు క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ కొత్త ఏర్పాట్లు దానిని మరింత బలపరుస్తాయి.

అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ఆసియాలో చైనా సైనిక విస్తరణపై హెచ్చరికలు జారీ చేశారు. సింగపూర్‌లో జరిగిన షాంగ్రి లా డైలాగ్‌ సమ్మిట్‌లో శనివారం ప్రసంగించిన హెగ్సెత్‌ ఈ విషయాలను వెల్లడించారు. చైనా చారిత్రక సైనిక విస్తరణ, ప్రాంతంలో తన సైనిక కార్యకలాపాలను విస్తరించడంపై ప్రాంతంలో సరైన ఆందోళన ఉందని హెగ్సెత్‌ తెలిపారు.

ప్రపంచంలో ఏ దేశమైనా ఆధిపత్యాన్ని సాధించి ప్రాంతీయ సమతుల్యాన్ని దెబ్బతీయకూడదని హెచ్చరించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యం ఏర్పడకుండా చూడడం అమెరికా ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఏ దేశమైనా సైనిక బలగాల ద్వారా బలప్రయోగం చేసి ప్రాంతీయ భద్రతను దెబ్బతీయకూడదని హెగ్సెత్‌ పేర్కొన్నారు.

ఆసియా మిత్రదేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని, స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. బలమైన మిత్రదేశాలు ఉంటేనే నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. అయినా అమెరికా అనవసరమైన ఘర్షణలకు వెళ్లదని, సమతుల్య శక్తిని కాపాడే దిశగా పని చేస్తుందని తెలిపారు.