TiffanyTrump | భార‌త్‌లో.. ట్రంప్ కుమార్తె

TiffanyTrump | భార‌త్‌లో.. ట్రంప్ కుమార్తె

  • భ‌ర్త‌తో క‌ల‌సి అక్ష‌ర‌ధామ్‌ను సంద‌ర్శించిన టిఫానీ
  • రేపు తాజ్‌మహ‌ల్ చూసేందుకు ప్లాన్

TiffanyTrump | న్యూ ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా తన భర్త మైఖేల్ బౌలోస్, స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ప్రపంచ ప్రసిద్ధ బీఏపీఎస్ స్వామినారాయణ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఆలయ నిర్వాహకులు టిఫానీ ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అక్షరధామ్ ఆలయంలోని అద్భుతమైన శిల్పకళను, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలను చూసి వారు ముగ్ధులయ్యారు. ఆలయ ప్రాంగణంలో సంప్రదాయ పూలమాలలు ధరించి వారు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని అన్వేషించడానికి ఇదొక అద్భుతమైన రోజు’’ అంటూ ఆలయ నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టిఫానీ ట్రంప్ సైతం ఇదొక మరువలేని అద్భుతమైన అనుభూతి అని ప్రశంసించారు.

రేపు తాజ్ మహల్ సందర్శన
ఢిల్లీ పర్యటన తర్వాత టిఫానీ ట్రంప్ ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ఆగ్రాకు వెళ్తారు. అక్కడ ప్రేమసౌధం తాజ్ మహల్‌ను ఆదివారం ఉదయం ఆమె సందర్శించనున్నారు. దాదాపు గంటన్నర పాటు ఆమె తాజ్ మహల్ పరిసరాల్లో గడపనున్నారు. ఆగ్రా పర్యటన అనంతరం అక్కడి నుంచి నేరుగా రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరమైన జైసల్మేర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ఇది పూర్తిగా టిఫానీ ట్రంప్ వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ, ఆమె అమెరికా అధ్యక్షుడి కుమార్తె కావడంతో భారతీయ భద్రతా సంస్థలు, స్థానిక పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ప్రొటోకాల్ ప్రకారం కట్టుదిట్టమైన భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కాగా టిఫానీ, భారత్‌కు రావడం ఇది తొలి సారి కాదు 2018లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్, భారత్ లో అధికారికంగా పర్య టించారు. అప్పుడు తండ్రితో పాటు టీఫానీ ట్రంపు, కూడా ఇక్క డికి వచ్చారు. ఆమె ట్రంపు రెండో భార్య కుమార్తె.