ఆగిపోయిన ఫైర్ ఇంజన్ వాహనం..

ఆగిపోయిన ఫైర్ ఇంజన్ వాహనం..

పరకాల, ఆంధ్రప్రభ : అత్యవసరంగా వెళ్లే అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వాహనాలకు దారి ఇవ్వకుండా వాహనాదారులు ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు పట్టణంలో దాపురిస్తున్నాయి. పట్టణంలోని బస్టాండ్ సర్కిల్ నుండి రాజధాని హోటల్, జయ డీలక్స్ రోడ్డులో బైకులు, వాహనాలు ఇస్టానురీతిలో పార్కింగ్ లు చేయడం పరిపాటిగా మారింది.

ఈ రోడ్డులో 10 నుండి 15 నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు.. బైక్, వాహనదారులు రోడ్డు పై పార్క్ చేయడం వల్ల జరుగుతుంది. శనివారం ఉదయం 9:15 నిమిషాల ప్రాంతంలో జయ డీలక్స్ రోడ్డు మార్గాన బస్టాండ్ ప్రాంతానికి వస్తున్న ఫైర్ ఇంజన్ వాహనానికి ఎదురుగా ఎడమవైపు రెండు కార్లు, కుడి వైపున టాటా ఏసీ వాహనం రోడ్డుపై ఉండడంతో హారన్ కొట్టినప్పటికీ కూడా వాహనదారులు చలించలేకపోయారు.

ఐదు నిమిషాల తర్వాత ఫైర్ ఇంజన్ వాహనం నుండి ఫైర్ మెన్ కిందికి దిగి వాహనాలను తీయవలసిందిగా కోరడం జరిగింది. అప్పటి వరకు కూడా వాహనదారులు అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాలనే విషయాన్ని మర్చిపోయారు. ఇదే విధంగా ఈ రోడ్డు మార్గంలో బైకులు, వాహనదారులు రోడ్ల పై పార్కింగులు చేయడం వల్ల అత్యవసర చికిత్స కోసం పేషెంట్లను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే అంబులెన్స్ కూడా అనేకసార్లు ఈ మార్గంలో వాహనాలు, బైకులు అడ్డుగా ఉండడం జరుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరంగా వెళ్లే వాహనాలకు దారి లేని కారణంగా సమయానికి చేరుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బస్టాండ్ సర్కిల్ ప్రాంతంలోని రాజధాని హోటల్, జయ డీలక్స్ రోడ్డు మార్గంలో పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.