వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రం పనులు వేగవంతం చేయాలి

వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రం పనులు వేగవంతం చేయాలి

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: భీమవరం మండలం తాడేరు గ్రామంలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుకు సమీకరించిన స్థలాన్ని సిద్ధం చేసి, పనులను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం తాడేరు గ్రామంలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కోసం సమీకరించిన 6.6 ఎకరాల స్థలాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనికిరాని ఘన వ్యర్థాలను సేకరించి, పర్యావరణానికి హాని కలగకుండా శుద్ధి చేసిన తర్వాత మిగిలే వ్యర్థాలను నిల్వ చేసే ప్రక్రియకు అనువుగా స్థలాన్ని సిద్ధం చేయాలని సూచించారు.

స్థలాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి ముందుగా శుభ్రం చేసి, లెవెలింగ్ చేయాలని అన్నారు. అనంతరం మట్టితో మెరక చేయాలని మండల తహసిల్దార్ రావి రాంబాబును ఆదేశించారు. స్థలానికి సమీపంలో ఉన్న చెరువు నుంచి నీరు చేరడం వల్ల బురదగా మారుతోందని, దాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పారు.

పట్టణ పరిధిలో ఏ చెరువుల వద్ద మట్టి అందుబాటులో ఉందో పరిశీలించి, వెంటనే పనులు ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులన్నీ వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

పబ్లిక్ హెల్త్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఈ కేంద్రం వినియోగంలోకి వస్తే ఇళ్లు, పరిశ్రమలు, వాణిజ్య ప్రాంతాల నుంచి సేకరించే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా విభజించవచ్చని తెలిపారు.

తడి చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చడం, పొడి చెత్తలోని ప్లాస్టిక్, కాగితం, గాజు, ఇనుము వంటి పదార్థాలను వేరు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ వివరించారు. రీసైక్లింగ్ ప్రాసెసింగ్ ద్వారా వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చడంతో పాటు, రీసైకిల్ కాని చెత్తను పర్యావరణ నిబంధనల ప్రకారం సురక్షితమైన ల్యాండ్‌ఫిల్స్‌లో పూడ్చిపెట్టడం జరుగుతుందని తెలిపారు.

ఘన వ్యర్థాల సేకరణ, శుద్ధి, పారవేతకు సంబంధించిన పూర్తి ప్రక్రియను ఈ కేంద్రం ద్వారా నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్రాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి పనులన్నీ పారదర్శకంగా, వేగవంతంగా, అన్ని శాఖల సమన్వయంతో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో భీమవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి, మండల తహసిల్దార్ రావి రాంబాబు, పబ్లిక్ హెల్త్ డీఈ ఆర్. విజయ్, పట్టణ ప్లానింగ్ అధికారి పార్థసారథి, సర్వేయర్లు పాల్గొన్నారు.

Leave a Reply