ప్రజా సమస్యల పరిష్కారానికే జనతా వారధి

ప్రజా సమస్యల పరిష్కారానికే జనతా వారధి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.
భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి స్వయంగా వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డ్వాక్రా మహిళా ఐకేపీ సెంటర్ల జీతాల బకాయిల విడుదల, ముత్యాలపల్లి హైస్కూల్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు డివైడర్ల ఏర్పాటు, నరసాపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న పాస్‌పోర్ట్ సమస్య తదితర అంశాలపై ప్రజలు కేంద్రమంత్రికి అర్జీలు సమర్పించారు.
ప్రజలు తెలిపిన సమస్యలపై శ్రీనివాస వర్మ వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికే భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయ వారధిలా నిలవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జనతా వారధి జిల్లా కన్వీనర్ తోట గంగరాజు, జిల్లా కో-కన్వీనర్లు ఇంజేటి వెంకటేశ్వర్లు, గాదిరాజు వెంకటేశ్వర రాజు, పాలకోడేరు మండల అధ్యక్షుడు బుద్దరాజు బలరామ రాజు, మొగల్తూరు మండల అధ్యక్షుడు కొల్లాటి చెన్నకేశవ రావు పాల్గొన్నారు.
పార్టీ నాయకులు ఇందుకూరి కోటేశ్వర రాజు, భూపతిరాజు సుబ్బరాజు, చెన్నంశెట్టి నాగరాజు, వెంకటేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
