నీటి సమస్యలపై అధికారులపై ఎమ్మెల్యే రాము ఆగ్రహం..
‘ఫిల్టర్ చేయని నీటిని ఎలా సరఫరా చేస్తారు?’
పోలుకొండ వాటర్ వర్క్స్ పనులు ఆదివారంలోగా పూర్తి చేయాలని ఆదేశం.. నిర్లక్ష్యం కొనసాగితే సీఎంకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక
నందివాడ, ఆంధ్రప్రభ : తాగునీటి సరఫరా ప్రతి ఒక్కరి ప్రాథమిక అవసరమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. గ్రామాల్లో ఒక్కరోజు కూడా నీటి కొరత ఏర్పడినా సహించబోనని, అధికారుల పనితీరులో మార్పు రాకపోతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
నందివాడ మండలంలోని తాగునీటి సమస్యలపై ప్రజావేదిక కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్, మండల పరిషత్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. పోలుకొండ గ్రామ తాగునీటి సమస్యపై అధికారులను నిలదీసిన ఆయన, శాఖల మధ్య సమన్వయ లోపంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ఫిల్టర్ చేయకుండా నీటిని ట్యాంకుల్లోకి ఎలా ఎక్కిస్తారు? గృహ అవసరాలకు కూడా పనికిరాని నీటిని కుళాయిల ద్వారా ఎలా సరఫరా చేస్తారు?” అని ప్రశ్నించారు. పట్టణాల్లో సమస్యలు లేకుండా చూస్తున్న అధికారులు గ్రామాల్లోని సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు.
గ్రామ నీటి సమస్య పరిష్కారానికి రూ.1.50 లక్షల నిధులు అవసరమని అధికారులు చెప్పడంతో, ఇప్పటి వరకు ఆ విషయాన్ని తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రజలు ఫిర్యాదు చేసిన తర్వాతే స్పందించడం సరికాదని, క్షేత్రస్థాయిలో సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని సూచించారు.
గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరిస్తున్నప్పటికీ, తాగునీటి సమస్యలు పదేపదే తలెత్తడం దిగువస్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమేనని ఆయన అన్నారు.
వాటర్ వర్క్స్ కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యేకు కార్మికుల కొరత ఉందని చెప్పగా.. “లేబర్ లేకుంటే నేనే వస్తాను.. గ్రామస్తులతో కలిసి పనిచేస్తాను” అని స్పందించారు. పోలుకొండ వాటర్ వర్క్స్ పనులను వచ్చే ఆదివారం నాటికి పూర్తి చేసి నీటి సరఫరా ప్రారంభించాలని కాంట్రాక్టర్‌కు అల్టిమేటం జారీ చేశారు. అవసరమైన నిధుల మంజూరులో ఎలాంటి ఇబ్బంది రాకుండా తానే పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.
తాగునీరు, గృహ అవసరాల నీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదో సమీక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కుళాయిల ద్వారా సరఫరా చేసే నీరు వినియోగానికి అనుకూలంగా ఉండాలని, నీటి నాణ్యతకు సంబంధించిన టెస్టింగ్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ సత్యనారాయణ, ఏఈ రూపేష్, ఎండీఓ మల్లీశ్వరి, మండల డీటీ కిరణ్, పంచాయతీ కార్యదర్శులు, డీసీసీబీ చైర్మన్ ఏసుబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, పోలుకొండ గ్రామ నాయకులు శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
