రైతుల ఆందోళనకు అండగా.. కలెక్టర్‌కు వినతి

ఆంధ్రప్రభ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని కోహెడ గ్రామంలో ప్రతిపాదిత ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు శుక్రవారం బాధిత రైతుల తరఫున జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన భూమిని పక్కనబెట్టి, ప్రస్తుతం సర్వే నంబర్ 167/1లోని సుమారు 264 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 160 మంది రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని, గతంలో అమలు చేసిన విధానాల ప్రకారం తగిన నష్టపరిహారం అందించి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.

వచ్చే నెల 3వ తేదీన ఫ్రూట్ మార్కెట్‌కు శంకుస్థాపన జరగనున్నట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో, ఆలోపు రైతుల జీవన భద్రతకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

సమస్యపై ప్రశ్నిస్తున్న రైతులపై అరెస్టులు, బెదిరింపులు లేదా ఇతర ఒత్తిడి చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు.