నిరుపేద పిల్లలకు వస్త్రాలు, స్నాక్స్ పంపిణీ..

ఘట్‌కేసర్, ఆంధ్రప్రభ : మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిరుపేద చిన్నారులకు బట్టలు, స్నాక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. మల్లేష్ నేతృత్వంలో, సోషల్ కనెక్ట్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సీఈఓ ఎం. హేమ సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనురాగ్ యూనివర్సిటీ అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారులకు వస్త్రాలను, ఆహార పదార్థాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. మల్లేష్ మాట్లాడుతూ.. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, నిరుపేదలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో మానవతా విలువలను, సేవాభావాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని విస్తృతమైన సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తాము, యువత సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చినప్పుడే సమాజంలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయి మల్లేష్ అన్నారు.. ఈ పంపిణీ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు..

Leave a Reply