రెండు గంటల వాన.. రాత్రంతా సహాయక చర్యలు

వైరా, ఆంధ్రప్రభ: వైరాలో గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కురిసిన వర్షం, బలమైన గాలుల కారణంగా జనజీవనం స్తంభించింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ లైన్లు తెగిపోయాయి.

గత కొన్ని రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, అనేక ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌బీఐ టౌన్ బ్రాంచ్ ఎదురుగా వేపచెట్టు కూలిపోవడంతో 11 కేవీ, ఎల్‌టీ విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి.

అదేవిధంగా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా, మసీద్ కాంప్లెక్స్ దుకాణాల సమీపంలో చెట్లు కూలిపోవడంతో విద్యుత్ లైన్లు తెగిపోయాయి. మొత్తం మూడు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఎనిమిదో వార్డులోని బోడెపూడి కాలనీ, మధు విద్యాలయం సమీపంలో విద్యుత్ స్తంభాలు విరిగిపడగా, పరుచూరి నర్సమ్మ ఇంటి రేకులు గాలికి ఎగిరిపోవడంతో ఇంట్లోని సామగ్రి దెబ్బతింది.

సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక కౌన్సిలర్లు సహాయక చర్యలు చేపట్టారు.

విద్యుత్ శాఖ డీఈఈ యల్లంపల్లి రమేష్ కుమార్, ఏఈ పాలేటి వెంకట సాయి కిరణ్ ఆధ్వర్యంలో మరమ్మతు పనులు వేగంగా చేపట్టారు. మదర్ రోడ్డులో చెట్టు కూలిపోవడంతో జేసీబీ సహాయంతో వైస్ చైర్మన్ కట్ల సంతోష్, ఎస్సై పుష్పాల రామారావు పర్యవేక్షణలో చెట్టును తొలగించారు.

ఎన్ఎస్పీ క్వార్టర్స్ ప్రాంతంలో చెట్టు కూలిపోవడంతో నాలుగో వార్డు కౌన్సిలర్ నిమ్మతోట శ్రావణి రత్నాకర్ స్పందించి తొలగింపు పనులు చేపట్టించారు. కరెంట్ కార్యాలయం సమీపంలోని చెట్లను కూడా జేసీబీ సహాయంతో తొలగించారు.

రాత్రి 10:30 గంటల నుంచి విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించి తెల్లవారుజామున 4 గంటల వరకు నిరంతరంగా పనిచేశారు. ఫలితంగా వైరా మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 80 శాతం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

Leave a Reply