పండగ పూట హోంగార్డు ఇంట విషాదం

పండగ పూట హోంగార్డు ఇంట విషాదం

కరెంట్ షాక్‌తో హోంగార్డు జానీ మృతి
ఈదురుగాలులు, అకాల వర్షంతో తెగిన విద్యుత్ వైర్ ప్రమాదం
కొత్తపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఘటన..
భార్య కళ్లముందే విషాదం

చిట్టినగర్, ఆంధ్రప్రభ : బక్రీద్ పండగ రోజున విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో సీఐ డ్రైవర్‌గా, హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న జానీ కరెంట్ షాక్‌కు గురై మృతి చెందారు. పండగ సందర్భంగా సెలవు తీసుకున్న జానీ, తన సొంత ఆటోలో భార్యతో కలిసి బిర్యానీ తీసుకుని ఇంటికి వెళ్తుండగా కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకున్నారు. అదే సమయంలో ఈదురుగాలులు, అకాల వర్షం కారణంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. నీటిలో ఆటో నిలిచిపోవడంతో భార్యను ఆటోలోనే ఉంచి, జానీ ఆటోను నెట్టుకుంటూ సమీప టీ స్టాల్ వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో భారీ గాలివానతో విద్యుత్ వైర్ తెగి ఆటో సమీపంలో పడింది. ప్రమాదాన్ని గుర్తించని జానీ, వెనక్కి కదులుతున్న ఆటోను ముందుకు నెట్టేందుకు కిందికి దిగగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆటోలో ఉన్న ఆయన భార్య మాత్రం సురక్షితంగా బయటపడింది. పండగ రోజునే కుటుంబానికి ఆధారమైన జానీ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, సహచర హోంగార్డులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనతో కొత్తపేట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.