కేసముద్రం మండలంలో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభం

కేసముద్రం మండలంలో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభం

కేసముద్రం, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి గాను కేసముద్రం మండలంలోని మూడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చినట్లు మండల విద్యాశాఖాధికారి యాదగిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల ఫీజుల భారం నుంచి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించడం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

2026-27 విద్యా సంవత్సరంలో అర్పనపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, బేరువాడ ప్రాథమికోన్నత పాఠశాల, రంగాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.

అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరంలో కల్వల ప్రాథమిక పాఠశాల, బోడగుట్ట తండా ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభమై కొనసాగుతున్నాయని ఎంఈవో తెలిపారు.

ప్రీ ప్రైమరీ తరగతుల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన వాతావరణంలో బోధన అందించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా ఆటపాటల ద్వారా విద్యాబోధన జరిగేలా పాఠ్యాంశాలు రూపొందించినట్లు ఎంఈవో యాదగిరి వివరించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply