రెండేళ్లలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది

రెండేళ్లలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది
కర్నూలు, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో గత రెండేళ్లలో ఊహించని స్థాయిలో అభివృద్ధి సాధించామని, ముఖ్యంగా కర్నూలును పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మహానాడు రెండో రోజు గురువారం నగరంలోని పలు క్లస్టర్లలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేలా ప్రసంగించారు.
కార్యక్రమాలకు ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన మంత్రి, ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, తెలుగు ప్రజలు ఎన్టీఆర్ సేవలను ఎన్నటికీ మరచిపోలేరని అన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం, అన్న క్యాంటీన్ వంటి కార్యక్రమాలు సామాన్య ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు.
ఓర్వకల్లుకు భారీ పెట్టుబడుల లక్ష్యం
కర్నూలు జిల్లాలో వలసలను అరికట్టేందుకు పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌గా రూపుదిద్దుకుంటోందని, రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా యువతకు భవిష్యత్‌లో పెద్దఎత్తున లాభం చేకూరుతుందన్నారు.
కర్నూలు నగరాభివృద్ధిపై దృష్టి
కర్నూలును స్మార్ట్ సిటీ తరహాలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. నగరంలో విద్యుత్ సమస్యలు తగ్గించేందుకు 850కి పైగా కొత్త విద్యుత్ స్తంభాలు, 40కిపైగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న వెంటనే స్పందిస్తూ పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వాసుపత్రిని కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేలా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
వైసీపీపై విమర్శలు
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి విమర్శించారు. గతంలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ చంద్రబాబు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని చెప్పడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
గత ప్రభుత్వ పాలన అరాచకంగా సాగిందని ఆరోపించిన ఆయన, ప్రస్తుతం ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగుతోందన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండే సంస్కృతి తెలుగుదేశం పార్టీదైతే, ఉద్రిక్తతలు సృష్టించడం వైసీపీ రాజకీయ శైలిగా మారిందని వ్యాఖ్యానించారు. మహానాడు కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్దఎత్తున పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు.
