స్థలం కబ్జా కలకలం.. న్యాయం కోసం మహిళ ఆవేదన
స్థలం కబ్జా కలకలం.. న్యాయం కోసం మహిళ ఆవేదన
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరులో పట్టా భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని అక్రమంగా కబ్జా చేశారనే ఆరోపణలతో ఓ మహిళ నడిరోడ్డుపై ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది.
బాధితుల వివరాల ప్రకారం, సర్వే నంబర్ 284/ఏ1లోని ప్లాట్ నంబర్ 408లో మూడు సెంట్ల స్థలం సుభద్ర బాయి, శేషారాం సింగ్ కుటుంబానికి 2012లో ప్రభుత్వం పట్టా రూపంలో కేటాయించింది. అయితే ఇటీవల ఆ స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఈ సమస్యపై బాధితులు మే 25న నిర్వహించిన ప్రజా సమస్యల వేదికలో ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం లభించలేదని వాపోయారు. దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు మంగళవారం వివాదాస్పద స్థలం వద్ద ఆందోళన చేపట్టారు.

ఆందోళన సమయంలో సుభద్ర బాయి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు. అనంతరం నీళ్లు చల్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పట్టా పత్రాలు ఉన్నప్పటికీ స్థలం స్వాధీనం కాకపోవడం, పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడం బాధాకరమని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టా భూముల రక్షణ, బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
