దిన్నె దేవరపాడు గ్రామస్తుల సొంతింటి కల ఎప్పటికి?
దిన్నె దేవరపాడు గ్రామస్తుల సొంతింటి కల ఎప్పటికి?
కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు రూరల్ మండలం దిన్నె దేవరపాడు గ్రామ ప్రజల సొంతింటి కల ఇప్పటికీ నెరవేరకపోవడం బాధాకరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా గ్రామస్తుల సమస్య మాత్రం పరిష్కారం కాకపోవడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
గురువారం దిన్నె దేవరపాడు గ్రామంలో గ్రామస్తులతో నిర్వహించిన సమస్యల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 300కుపైగా పేద కుటుంబాలకు ఇంటి పట్టాలు మంజూరు చేసినప్పటికీ, అనంతరం వచ్చిన ప్రభుత్వాలు వాటి అమలుపై దృష్టి సారించలేదని ఆరోపించారు. ఫలితంగా లబ్ధిదారులు ఇప్పటికీ ఇళ్ల నిర్మాణానికి నోచుకోలేకపోతున్నారని తెలిపారు.
ఇంటి పట్టాలు ఇచ్చిన తర్వాత సంబంధిత భూములకు సర్వే నిర్వహించకపోవడం, హద్దులు నిర్ణయించకపోవడం, నంబర్ రాళ్లు పాతకపోవడం వంటి అంశాలు అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతున్నాయని అన్నారు. పేదల దశాబ్దాల సొంతింటి ఆశ ఇంకా నెరవేరకపోవడం విచారకరమన్నారు.
దిన్నె దేవరపాడు గ్రామ ప్రజల సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని, సర్వే పూర్తి చేసి లబ్ధిదారులకు స్పష్టమైన హద్దులు చూపించి ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ, గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 427, 428, 429, 430ల్లో అప్పట్లో ఇంటి పట్టాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.
సమావేశంలో గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వెల్లడించారు.
